భారత్ త్వరలో కోవిడ్ రహితం కాబోతోంది : పీఎం మోడీ

భారత్ లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 100 శాతం సురక్షితమని, అందుకే అనుమతిచ్చామని డీసీజీఐ చీఫ్ వీజీ సోమాని వెల్లడించారు. 

దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ ను అభినందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్ త్వరలోనే కోవిడ్ రహితం కాబోతోందని పేర్కొన్నారు. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో ఆరోగ్యవంతమై, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని ప్రధాని మోడీ తెలిపారు. 

కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్ ను ప్రధాని అభినందించారు. అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం ప్రతి భారతీయినికి గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కోసం మన శాస్త్రవేత్తలు ఎంత శ్రమిస్తున్నారో తెలుస్తోందని ప్రధాని తెలిపారు.  

Leave a Comment