సామాన్యులపై మరో ‘బండ’.. పెరిగిన వంట గ్యాస్ ధరలు..!

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయలు దాటడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈక్రమంలో చమురు కంపెనీలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ ధరలను పెంచాయి. 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ పై రూ.25.50 పెరిగింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. 

పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్ పై సైతం రూ.84 పెరిగింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1550కు చేరువైంది. ముంబైలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.834.50 ఉండగా, కోల్ కతాలో రూ.861, చెన్నైలో 850.50, హైదరాబాద్ లో రూ.887గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్ కు రూ.25 పెంచగా, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ.25 పెంచారు. ఏప్రిల్ లో రూ.10 తగ్గినప్పటికీ, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా గత ఆరు నెలల్లో ఎల్ పీజీ ధర 14.2 కిలోల సిలిండర్ కు రూ.140 పెరగింది.   

Leave a Comment