చనిపోయిన అన్న పేరుతో.. 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా..!

కర్ణాటకలోని మైసూరులో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు.. చనిపోయిన తన అన్న సర్టిఫికెట్లతో 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ వచ్చాడు. మోసం బయటకు రావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి జ్యుడిషియల్ కస్టడి విధించింది. వివరాల మేరకు.. 

మైసూర్ జిల్లా కేఆర్ నగర్ లోని హెబ్బలు గ్రామానికి చెందిన లక్ష్మణె గౌడ అన్న లోకేశ్ గౌడ్ 1994-95లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. అయితే ఉద్యోగంలో చేరకముందే లోకేశ్ గౌడ్ మరణించాడు. దీంతో లక్ష్మణె గౌడ తన అన్న ఉద్యోగాన్ని సంపాదించాలని అనుకున్నాడు. అదుకోసం అన్నపేరుతో అపాయింట్ మెంట్ లెటర్ తయారు చేయించుకొని లోకేశ్ గౌడ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. 24 ఏళ్లు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు.. 

లక్ష్మణె గౌడ్ మోసం చేసి ఉద్యోగం సంపాదించిన విషయం హనసురుకు చెందిన సామాజిక కార్యకర్త రాజుకు తెలిసింది. అనుమానం వచ్చి రాజు లక్ష్మణె గౌడ గురించి వివరాలు ఆరాతీశాడు. 2019లో విద్యాశాఖ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేయాలని తహసీల్దార్ ను విద్యాశాఖ ఆదేశించింది. అయితే లక్ష్మణె గౌడ కుటుంబ సభ్యులు వివరాలు అందించలేదు. 

ఆ తర్వాత 2020లో లోకాయుక్తలో రాజు ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త అధికారులు నిందితుడిని విచారించింది. రిక్రూటింగ్ అధికారుల సమక్షంలో వాదనలు జరిగాయి. అయితే లక్ష్మణె గౌడ సరైన ధ్రువపత్రాలను సమర్పించలేదు. దీంతో మార్చి 21న పరియపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. 

Leave a Comment