నైపుణ్యాలు పెంచుకోవడమే పెద్ద బలం : మోడీ

కరోనా వైరస్ ప్రపంచానికి కొత్త సవాళ్లను తెచ్చిందని, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువత కొత్త నైపుణ్యాలను సంపాదించాలని, కొత్త నైపుణ్యం సంపాదించడమే యువతకు అతి పెద్ద బలమని మోడీ అన్నారు. కోవిడ్-19 ఉద్యోగాల స్వభావాన్ని మార్చిందన్నారు. మారుతున్న టెక్నాలజీ కూడా ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద ప్రతి నైపుణ్యం కూడా స్వాంలంబన భారత్ కు చాలా పెద్ద శక్తిగా మారుతుందని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉందని, కార్మికుల కోసం స్కిల్ మ్యాపింగ్ పోర్టల్ కూడా దేశంలో ప్రారంభించామని మోడీ తెలిపారు. నైపుణ్యం కలిగిన కార్మికులను మ్యాపింగ్ చేయడంలో ఈ పోర్టల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. 

మారుతున్న ప్రపంంచలో, అనేక రంగాలలో లక్షలాది మంది నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఉందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో అవసరం ఎక్కువగా ఉందన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా వందలాది ప్రధానమంత్రి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయన్నారు. ఐటీఐల సంఖ్యను పెంచామని, లక్షలాది కొత్త సీట్లను చేర్చామని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగిందని చెప్పారు. స్కిల్, రీ-స్కిల్, అప్ స్కిల్ అనే మంత్రాన్ని ప్రధాని మోడీ యువతకు చెప్పారు. 

Leave a Comment