ద్రవ్యోల్బణం పెరుగుదలతో పేదల కంటే ధనవంతులకే నష్టమట.. ఆర్థిక శాఖ నివేదిక..!

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. మే 2014 బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పిటి నుంచి ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో సామాన్యులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ రిపోర్టు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ధరల పెరుగుదలతో పేదలు, సామాన్య ప్రజల కంటే ధనవంతులే ఎక్కువగా నష్టపోతున్నారని పేర్కొంది… 

ఏప్రిల్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం, ఆర్థికవృద్ధి, రిటైల్ కన్సుమర్ ఇండెక్స్ తదితర అంశాలతో మే 12న కేంద్ర ఆర్థిక శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, పెరిగిన ధరల ప్రభావం పేదలు, సామాన్యుల కంటే ధనవంతులపైనే అధికంగా ఉందని తెలిపింది.  

ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ వినియోగదారులను మూడు కేటగిరీలుగా విభజించింది. 20 శాతం ధనవంతులు, 60 శాతం మధ్య తరగతి, 20 శాతం పేదలుగా తీసుకుంది. ఈ మూడు కేటగిరీల వారు చేస్తున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంది. అవి ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్, ఫుడ్, ఫ్యూయల్ మినహాయించిన వస్తువులుగా తెలిపింది. 

ద్రవ్యోల్బణ ప్రభావం ఎలా ఉంది?

  • 2021లో గ్రామీణ ప్రాంత పేదలపై ద్రవోల్బణ ప్రభావం 6 శాతం ఉండగా..2022లో 5.2 శాతానికి పడిపోయినట్లు ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొంది. పట్టణ ప్రాంత పేదలపై ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 
  • 2021లో గ్రామీణ ప్రాంత మధ్య తరగతి వారిపై ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉండగా 2022లో 5.3 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో 6.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గింది. 
  • 2021లో గ్రామీణ ప్రాంత ధనవంతలపై ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండగా 2022లో 5.6 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతంలో 5.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. 

మొత్తంగా సమాజంలో ద్రవ్యోల్బణం పెరుగుదల పేద, మధ్య తరగతి వారి కంటే ధనవంతులపైనే ఎక్కువ ప్రభావం చూపించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే 2022 మే 4న రిజర్వ బ్యాంక్ ద్రవ్యోల్బణ ఫలితాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పేదలపై అధిక ప్రభావం చూపిందని, వారి కొనుగోలు శక్తి తగ్గిపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మరీ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన ఈ నివేదికపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి..  

Leave a Comment