కరెంట్ అవసరం లేని ఏసీ.. కనుగొన్న గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు..!

వేసవి వచ్చిదంటే చాలు వేడి, ఉక్కపోత.. ఉపశమనం కోసం ఓ ఏసీ కావాలి.. ఏసీలు చల్లటి గాలితో వేసవిని కూల్ గా మార్చినా.. వీటి వల్ల వచ్చే కరెంట్ బిల్లులు మాత్రం చెమటలు పట్టిస్తాయి.. ఇక కరెంట్ కోతలు ఉంటే మాత్రం ఏసీలు ఉన్నా వేస్టే.. అయితే కరెంట్ లేకుండా ఏసీలు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. సరిగ్గా ఈ ఆలోచన వచ్చింది గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలకు.. వెంటనే ఈ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కరెంట్ లేకుండా పని చేసే ఏసీని కనిపెట్టారు. దాని పేరు ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’.. ఈ విధానంలో ఇంటి పైకప్పులకు రేడియేటివ్ కూలర్ పూత వేస్తే చాలు.. కరెంట్ అవసరం లేకుండానే ఏసీలా చల్లదనంగా ఉంటుందట.. ఈ విధానం ద్వారా సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని మరలా పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి.  ఆ రేడియోధార్మికత.. భూ వాతావరణం గుండా ప్రయాణించి.. చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది.. 

అయితే ఈ పాసివ్ రేడియోటివ్ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలో ఇవి పనిచేయవు. ఇవి పగటి సమయంలో కూడా ఉపయోగపడాలంటే.. ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి. అయితే ఇప్పటి వరకు రూపొందించినది మాత్రం పగటి సమయంలో సరిపడా చల్లదనం అందించలేకపోతున్నాయని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు..

సిలికాన్ డై ఆక్సైడ్, అల్యుమినియం నైట్రైడ్ లతో పలుచటి పొరలను ఉపయోగించి పాసివ్ రేడియేటివ్ కూలింగ్ ని తయారు చేశారు. ఈ పొరలు సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని పైకప్పు పూతగా వాడటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రతలు.. వెలుపలి కన్నా 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి.

కాగా పగటి సమయంలో పనిచేసే పాసివ్ రేడియేటివ్ కూలింగ్ వ్యవస్థను తయారు చేయడం చాలా కష్టమని, అయినా వారి పరిజ్ఞానంతో సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు.  ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ శీతల పరిజ్ఞానాలు.. వ్యర్థ వేడిని పరిసరాల్లోకి వెదజల్లుతాయి. రేడియోటివ్ కూలింగ్.. మిగులు వేడిని అత్యంత చల్లగా ఉండే అంతరిక్షంలోకి నేరుగా పంపడం ద్వారా భూమి మీద ఒక వస్తువును చల్లబరుస్తుంది. పగటి వేళ కూడా ఇది సమర్థవంతంగా పని చేస్తుంది. కంప్యూటర్ ఆధారంగా ఈ సాంకేతికతను పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. 

Leave a Comment