3 గంటలు చుక్కలు చూపించిన మూడో తరగతి బాలికలు.. పరీక్ష సరిగ్గా రాయలేదని పారిపోయేందుకు..!

హైదరాబాద్ లో మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టారు. స్కూల్ ముగిశాక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, పోలీసులు వారి ఆచూకి కోసం మూడు గంటల పాటు వెతికారు. తర్వాత వారి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలో జరిగింది.. 

వనస్థలిపురంలోని క్రాంతిహిల్స్, హిల్ కాలనీకి చెందిన 9, 10 ఏళ్ల ఇద్దరు బాలికలు రెడ్య ట్యాంక్ దగ్గరున్న ఓ ప్రైవేట్ స్కూల్ లో మూడో తరగతి చదువుతున్నారు. స్కూల్ అయిపోగానే ఓ బాలిక ఆటోలో.. మరో బాలిక వారి కుటుంబసభ్యులతో ఇంటికి వెళ్తారు. ఆటోలో వెళ్లే విద్యార్థినితో ఆమె సోదరుడు కూడా వస్తుంటాడు.. 

సోమవారం స్కూల్ అయిపోగానే బాలిక సోదరుడు ఆటోలో వేచి ఉన్నాడు. మరో బాలిక కోసం ఆమె తండ్రి ఎదురుచూస్తున్నాడు. ఉదయం 11.30 గంటలకు స్కూల్ వదిలేశారు. అరగంట గడిచినా ఇద్దరు విద్యార్థినులు రాలేదు.. దీంతో ఆటో డ్రైవర్, బాలిక తండ్రి పాఠశాలలో ఆరతీయగా.. వారు వెళ్లిపోయారని చెప్పారు.. 

పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు రెడ్ ట్యాంక్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. రెడ్ ట్యాంక్ వైపు వెళ్లి చూసినా వారి ఆచూకీ కనిపించలేదు. దీంతో వనస్థలిపురం ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాలిక తండ్రితో పాటు పోలీసులు కూడా వారి ఆచూకీ కోసం వెతికారు..

అక్కడే ఉన్న బాలికల స్నేహితుడిని విచారించారు. వారు పారిపోయేందుకు మూడు రోజులుగా ప్లాన్ వేస్తున్నారని, సుష్మా రోడ్డు వైపు వెళ్తామని చెప్పారని బాలుడు చెప్పాడు. అటువైపు వెళ్లి వెతకగా ఇద్దరు బాలికలు బస్టాప్ వద్ద కనిపించారు. ఇద్దరిని పాఠశాలకు తీసకొచ్చి ఏం జరిగిందని విచారించారు. హిందీ పరీక్ష బాగా రాయలేదని, సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు తమని హాస్టల్ లో పెట్టేస్తారనే భయంతో ఇలా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని బాలికలు తెలిపారు.  

Leave a Comment