20 ఏళ్ల యువతితో 17 ఏళ్ల యువకుడు సహజీవనం.. గొడవలు రావడంతో ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి..!

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎంతో మంది ప్రానాలు తీసుకుంటున్నారు. పెళ్లి వయసు రాకముందు నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. పెద్ద అంగీకరించరేమో అని ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం, అంతలోనే గొడవలు జరుగుతుండటం ఇలా రకరకాల కారణాలతో తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. 

యూసుఫ్ గూడలో నివసించే 17 ఏళ్ల యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్న  20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ వ్యవహారం పెద్దలకు తెలిసింది. వారు వారించినా వినలేదు. 

దీంతో జవహార్ నగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. వారం రోజుల కిందట గదిలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే రెండు రోజులుగా వారిద్దరికి మనస్పర్ధలు వచ్చాయి.  దీంతో శనివారం ఇద్దరూ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. 

యువతి చున్నీ ఊడిపోవడంతో ఆమె కిందపడిపోయింది. అయితే అప్పటికే యువకుడి మెడకు ఉరి బిగుసుకుంది. ఆమె వెంటనే వెళ్లి చుట్టుపక్క వారికి సమాచారం అందించి తీసుకొచ్చే సరికి యువకుడు మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment