దారుణం : రూ.కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురం చేస్తాడట..!

ఈరోజుల్లో కూడా అదనపు కట్నం వేధింపులు ఆగడం లేదు. ధర్మవరంకు చెందిన వ్యక్తి అదనపు కట్నం కింద రూ.కోటి ఇస్తేనే కాపురం చేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భార్యను బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వివరాల మేరకు కడపకు చెందిన గాయత్రికి ధర్మవరంలోని సత్యసాయినగర్ కు చెందిన దీపక్ కుమార్ తో 2018 డిసెంబర్ 27న వివాహం జరిగింది. దీపక్ బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. 

అప్పట్లో రూ.20 లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను ఇచ్చి వివాహం జరిపించారు. అంత ఇచ్చినా పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ.కోటి ఇవ్వకపోతే విడాకులు ఇస్తానంటూ బెరించడం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచులు కూడా అదనపు కట్నం కోసం వేధించేవారు. 

ఇక కొన్ని రోజుల తర్వాత గాయత్రీ గర్భం దాల్చింది. దీంతో ఆమెను పుట్టింటికి పంపించేశారు. ఇక దీపక్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గంజాయి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇది తప్పని చెబితే వినలేదు. పైగా మరింతగా వేధించాడు. గతేడాది గాయత్రీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయినా దీపక్ అమెను చూసేందుకు కూడా వెళ్లలేదు. దీంతో ఆమె కడప పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. 

అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు. తనకు విడాకులు కావాలని గాయత్రీకి నోటిసులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఎవరూ ఫోన్లు తీయట్లేదు. దీంతో కూతురిని తీసుకొని గాయత్రీ ధర్మవరం వచ్చింది. అయితే అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేశారు. దీంతో ఇంటి ముందే పాపతో ఆమె ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేశారు. మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దిరినీ కలిసి ఉండేలా చూస్తామని చెప్పారు. 

 

Leave a Comment