మీ ప్రాంతంలో సరైన స్పెషలిస్ట్ డాక్టర్లు లేరా.. మీరు స్పెషలిస్ట్ డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఎలాంటీ ఫీజు లేకుండా నిపుణులైన వైద్యుల వద్ద చికిత్స తీసుకోవచ్చు.. ఈ-సంజీవని ఓపీడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా అందిస్తున్న సర్వీస్ ఇది. దేశంలో ఎవరైనా దీనీనీ పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.. ఆన్ లైన్ లోనే స్పెషలిస్ట్ డాక్టర్ల వద్ద చికిత్స పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ-సంజీవని ఓపీడీ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ లోనే ప్రారంభించింది. ఈ-సంజీవని ఓపీడీ పేరుతో వెబ్ సైట్ మరియు ఆండ్రాయిడ్ యాప్ ని ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి దగ్గరే కూర్చొని తమకు అవసరమైన డాక్టర్లను సంప్రదించవచ్చు. ఈ-ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్లు అవసరమైన వైద్యాన్ని సూచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన డాక్టర్లు ప్యానెల్లో ఉంటారు.
ఈ-సంజీవని ఓపీడీలో రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
- ముందుగా ఈ-సంజీవని ఓపీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా హోం పేజీలో పేషంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కన్ఫార్మ్ అవుతుంది.
- తర్వాత పేషంట్ రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేసి.. టోకెన్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి.
- ఒకవేళ పాత హెల్త్ రికార్డులు ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఇది పూర్తయ్యాక పేషంట్ కి ఎస్ఎంఎస్ ద్వారా ఒక ఐడీ, టోకెన్ నెంబర్లు వస్తాయి.
- ఆ ఐడీ నెంబర్ తో అపాయింట్మెంట్ కోసం లాగిన్ కావాలి. దీంతో మీరు ఆన్ లైన్ క్లినిక్ లోకి ప్రవేశిస్తారు. పేషంట్ల సంఖ్యను బట్టి మీకు నెంబర్ కేటాయిస్తారు.
- తర్వాత పేషంట్ కి డాక్టర్ ని కేటాయిస్తారు. అప్పుడు స్క్రీన్ మీద ‘కాల్ నౌ’ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. 120 సెకండ్లలో మీరు దానిని క్లిక్ చేయాలి.
- అప్పుడు డాక్టర్ మీకు వీడియోలో కనిపిస్తారు. ఆయనతో మీ సమస్యను చెప్పుకోవచ్చు. మీ రికార్డులను పరిశీలించి డాక్టర్ ఈ-ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మీ మొబైల్ కి కూడా ప్రిస్క్రిప్షన్ వస్తుంది.
- ఇక్కడ మరో వెసులుబాటు ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ పై కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఫోన్ లో లాగిన్ అవ్వొచ్చు.
ఈ సేవలను ఆండ్రాయిడ్ యాప్ లో ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు డాక్టర్ ని సంప్రదించవచ్చు..
అధికారిక వెబ్ సైట్ : https://esanjeevaniopd.in/