ఆమ్లా క్యాండీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉసిరికాయలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉసిరితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది చాలా రకాల రోగాల నుంచి కాపాడుతుంది. అయితే ఉసిరి కాయలు అన్ని సీజన్లలో దొరకవు.. అందుకే దీంతో క్యాండీలను తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే.. చాలా కాలం వరకు ఉంటాయి. పిల్లలు కూడా ఈ కాండీలను ఇష్టంగా తింటారు. మరీ ఆమ్లా క్యాండీలను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆమ్లా క్యాండీల తయారీకి కావలసినవి.. 

  • ఉసిరి కాయలు – 250 గ్రాములు
  • చక్కెర – 150 గ్రాములు
  • జీలకర్ర పొడి – టీ స్పూన్
  • శొంఠి పొడి – టీ స్పూన్
  • చక్కెర పొడి – 2 టీ స్పూన్స్

తయారీ విధానం:

  • ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక పాత్రలో వేసి కాయలు మునిగేటట్లు నీటిని పోసి మరిగించాలి. 
  • నీరు మరిగిన తర్వాత ఉసిరికాయలను వేసి రెండు నిమిషాలు మరిగించిన తర్వాత పాత్రను స్టవ్ మీద నుంచి దించి నీటిని వంపేయాలి. ఉసిరి కాయలను కట్ చేసి గింజలను తీసివేయాలి. 
  • ఉసిరి పలుకులలో జీలకర్ర పొడి, శొంఠి పొడి, చక్కెర వేసి పాత్రకు మూతపెట్టి పక్కన పెట్టాలి. 
  • మరుసటి రోజుకు చక్కెర కరిగి ఉసిరి పలుకులు చక్కెర ద్రావణంలో తేలుతుంటాయి. మూడో రోజుకు చక్కెర ద్రావణాన్ని ఉసిరి పలుకులు దాదాపుగా పీల్చుకుంటాయి. 
  • మూడో రోజు ఉదయం ఉసిరి ముక్కలను ఒక పాలిథీన్ షీట్ మీద వేసి ఆరనివ్వాలి. తేమ పూర్తిగా పోవాలంటే రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఎండ సరిగ్గా లేకపోతే మూడో రోజు కూడా ఆరబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత చక్కెెర పొడిని ఎండిన ఉసిరి పలుకుల మీద చల్లాలి. దీనిని గాలి చొరని సీసాలో నిల్వ చేసుకోవాలి.   

 

Leave a Comment