ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు ఎంత ఉప్పు తినాలి?

ఏ వంటకానికైనా కేవలం ఒక్క చిటికెడుతో రుచిని తీసుకొచ్చే శక్తి ఉప్పుకు ఉంది. వంట ఎంత బాగా చేసినా.. తగినంత ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు.. ఉప్పులో ముఖ్యంగా సోడియం ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన సోడియంలో 90 శాతం ఉప్పు నుంచే లభిస్తుంది. అయితే ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపిస్తుంది. అలా అని ఉప్పును పూర్తిగా మానేయడం వల్ల కూడా ప్రమాదమే.. అందుకే ఉప్పును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?.. ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పు ఎంత తీసుకోవాలి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు 2 గ్రాముల సోడియం తీసుకోవాలి. అంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు లేదా ఒక టీస్పూన్ అన్న మాట.. కానీ మన ఇండియాలో ప్రభుత్వ డేటా ప్రకారం ప్రజలు రోజుకు 11 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికి రెట్టింపు పరిమాణంలో ఉప్పును తీసుకుంటున్నారు. 

ఉప్పు ఎక్కువ తింటే కలిగే నష్టాలు:

  • ఉప్పును అధిక మొత్తంలో తీసుకుంటే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్స్, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు, మెదడుకు రక్త సరఫరాలో అవాంతరాలు అంటే మెదడులోని సిరలు తెగిపోవడం లేదా రక్తం గడ్డకట్టడం వంటివి ఏర్పడవచ్చు. 
  • సోడియం అధికంగా తీసుకుంటే అది శరీరంలో కరిగిపోవడానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఈక్రమంలో శరీరంలోని కణాల నుంచి ఆ నీటిని సోడియం బయటకు లాగేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంది.

తక్కువ సోడియం ఉండే ఉప్పు ఏదీ?

  • మార్కెట్ లో ఎన్నో రకాల ఉప్పు లభిస్తుంది. వాటిలో ఎక్కువగా రిఫైన్డ్ సాల్డ్ లేదా సాధారణ ఉప్పును అధికంగా  ఉపయోగిస్తాం.. రిఫైన్డ్ సాల్ట్ లో 97-99 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. రిఫైన్డ్ ఉప్పును ఎలాంటి మలినాలు లేకుండా శుద్ధపరుస్తారు. కానీ పోషకాల పరంగా చూసుకుంటే ఈ ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.
  • సముద్రపు ఉప్పులో అధికంగా ఖనిజ లవణాలు ఉంటాయి. సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇందులో మన శరీరానికి ఎంతో మేలు చేసే అయోడిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ ఉప్పు కంటే సముద్రపు ఉప్పులో సోడియం 10 శాతం తక్కువగా ఉంటుంది. 
  • ఇక సెల్టిక్ సాల్ట్ లేదా గ్రే సాల్ట్ లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా సహజమైన ఉప్పు.. దీనిలో ఇతర పదార్థాలను కలపరు. 

ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం ఎలా?

  • ప్రీ ప్యాకెజ్డ్ ఫుడ్స్ తో పాటు కమర్షియల్ సాసెజెస్ తినడం మానేయాలి. 
  • ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్ కి బదులుగా ఉప్పు లేని చిరుతిళ్లను తినాలి. 
  • ఉప్పుతో పాటు మోనో సోడియం గ్లుటమేట్ ఉన్న ప్రీప్యాకెజ్డ్ ఫుడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.     

  

Leave a Comment