ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు తీవ్ర స్పందన

ఢిల్లీ : ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. అల్లర్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్ పై బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. 1984 లాంటి సిక్కు అల్లర్ల పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగాలని చెప్పింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు ఉప ముఖ్యమంత్రి మనేష్ సుసోడియాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో పర్యటించి స్థానికులకు భరోసా కల్పించాలని ఆదేశించింది. స్థానికులలో ఉన్న భయాందోళనలను దూరం చేసేలా చర్చలు నిర్వహించాలని చెప్పింది. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘర్షణల్లో ఇంటెలిజెన్స్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, అధికారి అంత్యక్రియలకు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సామాన్య ప్రజలకు జెట్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. గాయపడ్డ వారికి తక్షణ వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాధితులకు సాయం చేసేందుకు ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైతే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. 

Leave a Comment