మరో రెండు రోజులు భారీ వర్షాలు..

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్రవాడుగుండం కాకినాడ సమీపంలో తీరం దాటింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తెలంగాణ వైపు మళ్లీంది. అయినప్పటికీ దాని తీవ్రత కొనసాగుతోంది. ఇది క్రమంగా తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

హైదరాబాద్ లో భారీ వర్షం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారీ వర్షానికి అతలాకుతలం అవుతుంది. మంగళవారం రోజంతా భారీ వర్షం నమోదు కావడంతో రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వందేళ్లలో ఇది రెండో అత్యధిక వర్షపాతం అని పేర్కొంది. దీంతో రోడ్లపై పార్క్ చేసిన కార్లు నీటి ప్రవాహానికి కోట్టుకుపోయాయి. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 

ఖైరతాబాద్, చింతల్ బస్తా, గాంధీనగర్, మారుతీ నగర్, శ్రీనగర్, ఆనంద్ నగర్, యూసఫ్ గూడ, బి.ఎన్.రెడ్డి గాంధీనగర్, హయాత్ నగర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ముంపుతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మూడు రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారులు కోరారు. 

 

ఏపీలో ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద నీరు..

ఇక ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వరదలు, వర్షం కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తుతోంది. వరద ప్రవాహంతో 70 గేట్లు ఎత్తివేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయ. సాగరం గెడ్డలో వరద ప్రవాహానికి యువకుడు గల్లంతయ్యాడు. వంశధార, నాగావళి నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 15 సెం.మీ వర్షాపాతం నమోదైంది. క్రిష్ణా జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

 

Leave a Comment