OMG! 210 నిమిషాలు ఆగిన గుండె.. అయినా బతికింది..!

సాధారణంగా రెండు నిమిషాలు గుండె ఆగిపోతే చనిపోయినట్లు నిర్ధారిస్తారు వైద్యులు.. అలాంటిది ఓ మహిళకు 210 నిమిషాల పాటు అంటే మూడున్నర గంటల పాటు గుండె ఆగిపోయింది. అయినా ఆమె బతికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. కంకరఖేడాకు చెందిన 34 ఏళ్ల కవిత అనే మహిళ గత రెండేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా.. వెయిటింగ్ లిస్ట్ కారణంగా ఆమె చికిత్స తీసుకోలేకపోయింది.  

ఈక్రమంలో మహిళ లాలా లజపత్ రాయ్ మెమోరియల్ వైద్య కళాశాలకు వెళ్లింది. అక్కడ కార్డియో థోరాసిక్ విభాగపు వైద్యులను సంప్రదించింది. వారు మహిళకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మిట్రాల్ వాల్వ్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. మిట్రాల్ వాల్వ్ ను మార్చడానికి రోగికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు.

వెంటనే ఆపరేషన్ చేసి మెసీన్ సహాయంతో మెకానికల్ హార్ట్ వాల్వ్ ను విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్ సమయంలో దాదాపు 210 నిమిషాల పాటు రోగి గుండె ఆగిపోయిందని డాక్టర్ రోహిత్ చౌహాన్ తెలిపారు. అయితే అత్యాధునిక యంత్రాల ద్వారా గుండె కొట్టుకునేలా చేసి విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ మెడికల్ కాలేజీ చరిత్రలోనే తొలిసారి అని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించింది.  

Leave a Comment