వెలుగును నింపేది గురువే…గురుపూజోత్సవ శుభాకాంక్షలు..!

పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తే..వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది మాత్రం ఉపాధ్యాయులే..దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు వారే. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును నింపుతారు. క్రమశిక్షణ నేర్పిస్తారు..భావిభారత పౌరులను తయారు చేస్తారు. తల్లిలా లాలిస్తారు. తండ్రిలా రక్షిస్తారు. మిత్రునిలా చేరదీస్తారు..ఆప్తునిలా ఆదరిస్తారు. క్రమశిక్షణతో పాటు విలువలు నేర్పే ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు. 

తరగతి గదిలో దేశ భవిష్యత్ ఉంటుందని చాటిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన సెప్టెంబర్ 5, 1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరం ఉన్న తిరుత్తణిలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎంఏ పట్టా పొందారు. 1906లో 18 ఏళ్ల వయస్సులో శివకామమ్మతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు కలిగారు. 

ఉద్యోగం…

21 సంవత్సరాల వయస్సులో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో పొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభకు మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి నంజుండయ్య ఆయనను పిలిపించి ప్రొఫెసర్ గా నియమించారు. అనంతరం కలకత్త విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టారు. ఆ సమయంలో భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని రాశారు. 

1952లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదువులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడు ఆడంబరాలకు పోలేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా చేయాలని ఆయన కోరారు. ఆ రోజు నుంచి ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకోవడం అనవాయితీగా మారింది. 

Leave a Comment