ఆ ఊర్లో హనుమంతుడిని ద్వేషిస్తారట.. ఎక్కడో తెలుసా..!

ప్రతి ఊర్లోనూ హనుమంతుడి గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు.. పట్టణాల్లో అయితే హనుమంతుని ఆలయాలు చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ హనుమంతున్ని పూజిస్తారు. బుద్ధి బలానికి, దేహ బలానికి నివేచన శక్తికి మరో పేరు హనుమంతుడు.. ప్రతిరోజు హనుమంతున్ని పూజిస్తే చక్కటి గుణాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. శ్రీరాముని సేవలో జీవితాన్ని దన్యం చేసుకొని ఆ దేవున్ని భాగ్యాన్ని పొందిన పుణ్యాత్ముడు హనుమంతుడు.. అలాంటి హనుమంతుడిని ఆ ఊర్లో అస్సలు పూజించరట. అసలు ఆ ఊర్లో హనుమంతుడి పేరు వినిపించడాన్ని కూడా ఒప్పుకోరట.. అనేక మంది ఇష్టదైవంగా పూజించే హనుమంతుడిని వెలేసిన ఆ ఊరి పేరు ఏమిటో తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని ద్రోణగిరిలో హనుమంతుడిని పూజించరు. ఈ ఊరు ఢిల్లీ నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కమవొన్ పర్వత శ్రేణుల్లో ఉంది. ఆరు గ్రామాల సమూహంతో ఈ ద్రోణగిరి ఏర్పడింది. ఇక్కడ ప్రసిద్ధ శక్తి పీఠం కూడా ఉంది. పాండవుల గురువు ద్రోణాచార్యుడు ఇక్కడి కొండపై తపస్సు చేశారని, అందుకే ద్రోణగిరి అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. 

ఈ ద్రోణగిరిలో ప్రజలు హనుమంతుడిని పూజించరు.. ద్వేషిస్తారు. అసలు హనుమంతుడి పేరు ఎత్తడానికి కూడా వీల్లేదు అక్కడ.. ఎవరైనా ఆంజనేయస్వామిని పూజించినట్లు తెలిస్తే మాత్రం ఊరి నుంచే బహిష్కరిస్తారు.  ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని మొక్క కోసం.. అది ఉన్న పర్వాతాన్నే తీసుకొస్తాడు. 

అయితే ద్రోణగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ పర్వతంపై సంజీవని మొక్కను చూపించిందని, అయితే ఆంజనేయుడు సంజీవని మొక్క ఉన్న పర్వతాన్నే ఆ గ్రామం నుంచి తీసుకెళ్లాడని ద్రోణగిరి ప్రాంతం ప్రజలు చెబుతారు. అప్పటి నుంచి ఆంజనేయుడు తమకు సంజీవనిని దూరం చేశాడని వారికి కోపం.. అందుకే ఆంజనేయుడిని ఆ ప్రాంత ప్రజలు పూజించరు.  

Leave a Comment