ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులు.. రెండేళ్ల కుమారుడు.. కడుపులో మరో బిడ్డ.. అయినా అదనపు కట్నం వేధింపులు ఆమె ప్రాణం తీశాయి.. భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా గోపాలపూర్ లోని బ్యాంక్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల మేరకు ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన జాటోతు అనూష(28) హనుమకొండ యూనియన్ బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తోంది. 2019లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లికి చెందిన లావుడ్యా ప్రవీణ్ నాయక్ తో వివాహమైంది. ప్రవీణ్ నాయక్ హంటర్ రోడ్డులోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు.
వివాహం సమయంలో రూ.20 లక్షలు కట్నంతో పాటు ఇతర లాంఛనాలు సమర్పించుకున్నారు. అయినా ప్రవీణ్ అదనపు కట్నం కోసం భార్య అనూషను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. ఖమ్మంలో రూ.కోట్ల విలువ చేసే ఎకరం భూమిని కూడా ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాం చెందిన అనూష మరో గదిలో ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపుల వల్లే తమ అనూష ఆత్మహత్యకు పాల్పడిందని బుధవారం బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.