13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..!

గుంటూరు జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆనారోగ్యం పాలైన ఆ బాలిక రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తండ్రికి చెందిన . దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల మేరకు పల్నాడులోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల  బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఆమె 7 నెలల కింద కరోనా బారినపడి గుంటూరు జీజీహెచ్ లో చేరింది. బాలిక తల్లి కూడా కరోనా సోకి చికిత్స పొందుతూ చనిపోయింది. 

గుంటూరు స్వర్ణభారతి నగర్ కు చెందిన ఓ మహిళ ఆ బాలికకు ఎవరూ లేరని తెలుసుకుంది. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది. బాలికకు నాటు వైద్యం చేస్తే కరోనా తగ్గిపోతుందని నమ్మించి.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం చేయాలని బాలికను ఒత్తిడి చేసింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పినా బాలికను ఇంట్లో బంధించింది. కొన్నాళ్ల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. ఒంగోలు, విజయవాడ, నెల్లూరుకు తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. 

కాగా కొద్ది రోజుల కింద బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో వ్యభిచార నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేసింది. ఆ తర్వాత ఇంటికి చేరుకుంది. బాలిక తండ్రి రెండు నెలల క్రితం బాలిక తప్పిపోయినట్లు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియడంతో నల్లపాడు పోలీసులు కేసును మూసేశారు. అయితే రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలిసినా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. దీని వెనుక ఉన్న రహస్యాలు ఏంటీ? బాలికను తండ్రే ఆ మహిళకు అప్పగించాడా? ఈ రెండు నెలలు బాలిక ఎవరిచెరలో ఉంది? అనే ప్రశ్నలకు పోలీసులకు సమాధానం దొరకడం లేదు. బాలిక చెప్పిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. ప్రస్తుతం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Leave a Comment