ఎన్నికలకు సిద్ధం కండి.. ప్లీనరీలో సీఎం జగన్

ఎన్నికలకు సన్నద్ధం కావాలని వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. గుంటూరు వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. మనం చేసే మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా ముందుకు కదలాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

తనపై 13 ఏళ్లుగా అభిమానం చూపిస్తున్న కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు సీఎం జగన్ సెల్యూట్ చేశారు. తనపై కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయని, ఇంటి కుట్రలకు, తప్పుడు కేసులకు తాను లొంగేవాడిని కాదని సీఎం జగన్ అన్నారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయిందన్నారు. తమ మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నామని, ప్రజలకు మంచి చేయడమే తన ఫోకస్ అని తెలిపారు. క్యారెక్టర్, క్రెడిబులిటీయే తమల్ని ముందుకు నడిపిస్తాయన్నారు. 

పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ టీడీపీ:

పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ టీడీపీ అని సీఎం జగన్ అన్నారు. గజ దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో డబ్బులు దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శంచారు. గజదొంగల ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. చక్రాలు లేని సైకిల్ చంద్రబాబు తొక్కలేకపోతున్నారని ఎద్దేవే చేశారు. తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడుని అరువు తెచ్చుకున్నారని… ఎల్లో మీడియా చెప్పినంత మాత్రానా అబద్దాలు నిజం కావని వ్యాఖ్యానించారు. గట్టిగా మొరిగినంత మాత్రానా గ్రామసింహాలు.. సింహాలు కావన్న జగన్… చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్టే అని స్పష్టం చేశారు.

‘ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదే. నాకున్న ఏకైక అండాదండ ప్రజలే. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. ఎన్నికలకు మనం సన్నద్ధం కావాలి. రాష్ట్ర భవిష్యత్‍కు, మీ భవిష్యత్‍కు నాదే బాధ్యత. పార్టీ ఎప్పుడూ మీకు తోడుగా, అండగా ఉంటుంది’  అని సీఎం జగన్ తన ప్రసంగంలో తెలిపారు. 

Leave a Comment