సామాన్యులపై మళ్లీ భారం.. వంట గ్యాస్ పై రూ.100 పెరిగే అవకాశం..

సామాన్యులు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారు. అయితే సామాన్యులకు వంట గ్యాస్ రూపంలో మరో షాక్ తగలనుంది. చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరను మరోసారి పెంచే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ గ్యాస్ ధరలు 60 శాతం పెరగడంతో సిలిండర్ పై రూ.100 నష్టం వస్తుందని చమురు కంపెనీలు తెలిపాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ధరలు పెంచక తప్పదని చెబుతున్నాయి. దీంతో దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే ధర పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం చమురు సంస్థలు వేచి చూస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి రాగానే గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది. అయితే సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం ఎంతవరకు భరిస్తుందో తెలియదు. కావును గ్యాస్ ధరను ఎంత పెంచాలో ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ రంగ చమురు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ ప్రభుత్వం సబ్సిడీ భరించడానికి సిద్ధంగా లేకపోతే సిలిండర్ ధర పెంచుతామని పేర్కొన్నాయి. అయితే పెంపు మరీ ఎక్కువగా ఉండదని, మధ్యస్థంగా ఉంటుందని తెలిపాయి. కాగా ఈ నెల 6వ తేదీనే సిలిండర్ పై రూ.15 పెంచారు. జూలై నుంచి లెక్కిస్తే విడతల వారీగా మొత్తం రూ.90 పెరిగింది. 

  

 

Leave a Comment