సొరకాయ రూ.2 లక్షలు అంట.. శ్రీశైలంలో జనాలను బురిడీ కొట్టించి అమ్మేశారు..!

ఓ ముఠా కొత్త రకం మోసాలక తెరలేపింది. అత్యాశపరులను, అమయాకులన టార్గెట్ చేసి మహిమలు ఉన్న బుర్రకాయ(నాగస్వరం కాయ)ను తమ వద్ద ఉంచుకుంటే అన్ని కలిసివస్తాయంటూ బురిడీ కొట్టించి లక్షలు దండుకునేవారు. 22 మందితో కూడిన ముఠాలోని 21 మందిని కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల మేరకు శ్రీశైలం శ్రీ సవారి విశ్వేశ్వర అన్నపూర్ణ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న అరవిందరెడ్డి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన ఆలోచనలతో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 21 మందితో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. అందులో కొన్ని గ్రూపులుగా విభజించాడు. ఈ గ్రూపులు ఆలయాలు, జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరుగుతూ అమాయకులను, దురాశా పరులను, సమస్యల్లో ఉన్న వారిని గుర్తించి బుర్రకాయ మహిమలను వివరించే వారు. 

బుర్రకాయ ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నమ్మించేవారు. వారి బలహీానతలను ఆసరాగా చేసుకుని బుర్రకాయలను రూ.లక్షలకు అంటగట్టేవారు. కర్ణాటకలో ఓ వ్యక్తికి బుర్రకాయను ఏకంగా రూ.2 లక్షలకు టోకరా పెట్టారు. 

ఇలా చిక్కారు..

ఇటీవల ఆత్మకూరు సమీపంలో ఒక ఆలయం వద్ద ఉన్న గ్రూపు సభ్యులను సీఐ క్రిష్ణయ్య విచారించగా అసలు విషయం బయటపడింది. వారిచ్చిన సమాచారంతో దందాలో పాలు పంచుకుంటున్న ఇద్దరు మహిళలతో పాటు మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 23 సెల్ ఫోన్ లు, రూ.5,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు అరవిందరెడ్డి పరారీలో ఉన్నారు. అతడు అరెస్ట్ అయితే మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. 

Leave a Comment