జవాన్ శివగంగాధర్ కు కన్నీటి వీడ్కోలు..!

భారత సరిహద్దు లద్దాఖ్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మీ జవాన్ శివ గంగాధర్(28) అంత్యక్రియలు సోమవారం జరిగాయి. గంగాధర్ స్వగ్రామం కొత్తపల్లె మండలం గువ్వలకుంట్ల గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన పొన్నపాటి శివ గంగాధర్ ఆర్మీ జవాన్ గా  చైనా బార్డర్ లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం సాయంత్రం వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం లోయలో పడింది. దీంతో గంగాధర్ కు తీవ్ర గాయాలు కావడంతో కోలుకోలేక మృతి చెందాడు.

జవాన్ మృత దేహాన్ని కడసారా చూసేందుకు పరిసర గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. శివగంగాధర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు లద్దాఖ్ నుంచి ముగ్గురు ఆర్మీ జవాన్లు, హైదరాబాద్ నుంచి 37 మంది ఆర్మీ సిబ్బంది, కర్నూలు నుంచి పది మంది పోలీసులు వచ్చారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, అశ్రునివాళులతో గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. 

 

Leave a Comment