అధికార లాంఛనాలతో వీర జవాన్లకు అంత్యక్రియలు..!

ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో వీర మరణం పొందిన అమర జవాన్ల అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో జవాన్ రౌతు జగదీష్ ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ స్థానికులు పూల వర్షం కురిపించారు. 

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మురళీకృష్ణది పేద వ్యవసాయ కుటుంబం.. ఆరేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ జవాన్ గా ఉద్యోగంలో చేరాడు. కోబ్రా-210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 

మురళీకృష్ణకు మే 22న వివాహం జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఈనెల 1న మురళీకృష్ణ తన తల్లికి ఫోన్ చేసి సెలవు మంజూరైందని, మే 15న ఇంటికి వస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

Leave a Comment