అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..!

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. అప్పుల బాధలు భరించలేక కొడుకు, కూతురికి విషమిచ్చి దంపతులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

జంజిరాల రమేశ్(40), పద్మ(35) దంపతులు ఒక గదిలో ఉరి వేసుకోగా, కుమారుడు అక్షయ్(17), కుమార్తె సౌమ్య(19) మరో గదిలో పడి ఉన్నారు. కూతురు సౌమ్య ఇటీవల అత్తవారింటి నుంచి పట్టింటికి వచ్చింది. కాగా,ఇంట్లో నలుగురు సంతకాలు చేసిన ఓ సూసైడ్ నోట్ లభించింది. అప్పుల బాధలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేశ్ లేఖలో పేర్కొన్నాడు. రమేశ్ కొన్నాళ్లుగా భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈక్రమంలో పెట్టిన పెట్టుబడి అంతా పోయిందని, చేతిలో కనీసం రూ.10 లక్షలు ఉన్నా గట్టక్కేవాళ్లమని లేఖలో రాశాడు. లేదా ఎకరం పొలం ఉన్నఅమ్ముకుని బతికేవాళ్లమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Leave a Comment