ఘోరం.. టాయిలెట్ లో కబడ్డీ ఆటగాళ్లకు భోజనం..!

మీరు ఎప్పుడైనా మరుగుదొడ్డిలో భోజనం చేశారా? ఈ ప్రశ్న వినడానికే అసహ్యంగా ఉంది కదూ.. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వాళ్లు భోజనం చేస్తోంది టాయిలెట్ లోనే.. అలాగని వాళ్లు నిరాశ్రయులు కాదు.. వరదబాధితులు అంతకటే కాదు.. ఓ రాష్ట్రం తరఫున క్రీడాపోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

ఉత్తర ప్రదేశ్ షాహారన్ పూర్ లో ఈమధ్య అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. అయితే టాయిలెట్ గదుల్లో భద్రపరిచిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 16న కొందరు అమ్మాయిలే ఈ వీడియో లీక్ చేసినట్లు తెలుస్తోంది. టాయిలెట్ లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్ ముక్కపై నుంచి పూరీలను అమ్మాయిలు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని తీసుకుని బయట ఆహారం వండిన స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లి వాళ్లు తింటున్నారు. ఈ వీడియోలో అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. 

ఈ వ్యవహారంలో విమర్శలు రావడంతో షాహారన్ పూర్ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనా స్పందించారు. స్డేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయని, ఆ సమయంలో వర్షం పడిందని, అందుకే స్విమ్మింగ్ పూల్ వద్ద వంటలు చేయించామని తెలిపారు. అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే గదిలో అని అన్నారు. టాయిలెట్ లో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు. 

కబడ్డీ ప్లేయర్లకు మరుగుదొడ్డిలో ఆహారం అందించిన ఘటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లా స్పోర్ట్స్ అధికారి అవినేష్ సక్సేనాతో పాటు ఫుడ్ కాంట్రాక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

Leave a Comment