అలాంటి ఫ్యాక్టరీలపై దృష్టి పెట్టండి : సీఎం జగన్

విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై అధికారులతో సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. 

ట్యాంకర్‌లోని రసాయనంలో 60 శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుందని వివరించారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.  ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయన్నారు. 

సమగ్ర విచారణతో రావాలి..

గ్యాస్ లీక్ ఘటనపై  సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలన్నారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలన్నారు. 

వాటిపై దృష్టి పెట్టండి..

విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో, అందులో జనావాసాల మధ్య ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సీఎం ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలన్నారు. 

 

Leave a Comment