రూ.35 కోసం ఐదేళ్లు పోరాటం.. 2.98 లక్షల మందికి లబ్ధి..!

రైల్వే టికెట్ పై రావాల్సిన రూ.35 రీఫండ్ కోసం ఓ వ్యక్తి ఐదేళ్ల పాటు పోరాటం చేశాడు. అతడి పోరాటంతో సుమారు 3 లక్షల మందికి లబ్ధి జరిగింది. ఇంతకు ఏం చేశాడు.. రాజస్థాన్ లోని కోటకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి 2017 జులై 2న కోట్ నుంచి ఢిల్లీకి ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా ఏప్రిల్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. 

టికెట్ బుక్ చేసుకున్నప్పుడు దాని ధర రూ.765 ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అయితే క్యాన్సిలేషన్ ఫీజ్ కింద రూ.65 తీసుకోవాల్సి ఉండగా రూ.100 కట్ చేశారు. 2017లో జులై 1న జీఎస్టీ అమలులో వచ్చింది. దానికి ముందే స్వామి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయినప్పటికీ సేవా రుసుము కింద రూ.35 వసూలు చేశారు. 

అధికంగా రుసుము వసూలు చేయడంపై స్వామి పోరాటినికి దిగారు. రైల్వేకు, ఐఆర్సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద సుమారు 50 అర్జీలు పెట్టారు. దీంతో రూ.35 తిరిగి చెల్లించేందుకు ఐఆర్సీటీసీ అంగీకరించింది. 

కానీ, 2019 మే1న ఆయన బ్యాంక్ అకౌంట్ కి రూ.33 మాత్రమే జమ అయ్యాయి. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి పట్టుబట్టారు. దాని కోసం మరో మూడేళ్ల పాటు పోరాడారు. దీంతో ఎట్టకేలకు రైల్వే శాఖ దిగొచ్చింది. 2.98 లక్షల మందికి ప్రతి టికెట్ పై రూ.35 చొప్పున మొత్తం రూ.2.43 కోట్ల రీఫండ్ చెల్లించేందుకు అంగీకరించింది. 

Leave a Comment