మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి : సీఎం జగన్

అమరావతి : మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలనీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. వారి కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. వారి ప్రధాన వృత్తి వేట అని, దీని కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫిషింగ్‌ హార్బర్లను పూర్తిచేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. 

కొత్తగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

కొత్తగా 9 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రెండు విడతల్లో హార్బర్ల నిర్మాణం చేస్తామన్నారు. దాదాపు రూ.2,901.61 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్‌ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. 

రెండో విడత కింద రూ. 1597. 61 కోట్లతో మరో ఐదు చోట్ల హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  ప్రకాశం జిల్లా వాడ్రేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలెం, ఎడ్డువాని పాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.  మొత్తంగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తామన్నారు. డీప్‌ సీ ఫిషింగ్‌ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 

ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ తెలిపారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మిగిలి  ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలూ పూర్తిచేయాలన్నారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులు కన్నా.. పర్యావరణ హితమైన ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్ సూచించారు. 

 

Leave a Comment