చేపల లారీ బోల్తా.. అరగంటలో లోడు మొత్తం ఖాళీ..!

ఫ్రీగా వస్తే మనోళ్లు దేన్నీ వదలరు.. అప్పుడప్పుడు రోడ్డుపై లారీ, కంటైనర్లు బోల్తా పడుతుంటాయి. అప్పుడు సమీప గ్రామ ప్రజలకు పండగే.. ఎందుకంటే ప్రమాదంలో గాయపడిన వారి కంటే లారీలోని వస్తువుల కోసం ప్రజలు ఎగబడుతుంటారు.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.. దీంతో చేపల కోసం జనాలు ఎగబడ్డారు.. 

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్ ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లారీలోని చేపలన్నీ రోడ్డుపై చెల్లా చెదురైపోయాయి.

బోల్తా పడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. అందరూ రోడ్డుపైకి చేరుకుని చేపలను పట్టుకెళ్లారు. ఈక్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఎంత వారించినా పట్టించుకోలేదు. సుమారు 2 కేజీల బరువు ఉండే సుమారు 4 వేల చేపలు ఉన్న లారీ లోడ్ ను అరగంటలో ఖాళీ చేశారు. 

   

Leave a Comment