ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో తొలిసారిగా ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ఖరారు చేసింది. ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీవో 53, 54లను విడుదల చేసింది. 

ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ హెల్త్ కేర్, స్టడీ టూర్ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రావాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవానా చార్జీల కింద కిలోమీటర్ కు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది. 

ప్రాంతాలు, తరగతుల వారీగా పాఠశాలల ఫీజు(రూపాయల్లో):

 

ప్రాంతంప్రైమరీ(నర్సీరీ-5) తరగతులుసెకండరీ(6-10) తరగతులు
పంచాయతీరూ.10,000రూ.12,000
మున్సిపాలిటీరూ.11,000రూ.15,000
కార్పొరేషన్రూ.12,000రూ.18,000

 

ప్రాంతాలు, గ్రూపుల వారీగా జూనియర్ కాలేజీల ఫీజు(రూపాయల్లో):

 

ప్రాంతంఎంపీసీ/బైపీసీసీఈసీ/హెచ్ఈసీ
పంచాయతీరూ.15,000రూ.12,000
మున్సిపాలిటీరూ.17,500రూ.15,000
కార్పొరేషన్రూ.20,000రూ.18,000

 

స్కూళ్లు, కాలేజీల్లో హాస్టళ్ల ఫీజు:

 

ప్రాంతంస్కూళ్లు/కాలేజీ
పంచాయతీరూ.18,000
మున్సిపాలిటీరూ.20,000
కార్పొరేషన్రూ.24,000

 

ఈ జీవోల్లో పేర్కొన్న మరికొన్ని నిబంధనలు:

  • కేపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు.
  • పాఠశాలల్లో జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట అదనంగా సొమ్ము వసూలు చేయకూడదు.
  • కాలేజీల్లో జేఈఈ, నీట్ తదితర అదనపు కోచింగ్ లకు రూ.20 వేల వరకు మాత్రమే తీసుకోవాలి. 
  • ఆయా కోచింగ్ లు, హాస్టళ్ల నిర్వహణకు సంబంధిత విభాగాల అనుమతి తీసుకోవాలి. 
  • ఫీజులతో పాటు ఇతర రికార్డులన్నీ క్రమపద్ధతిలో నిర్వహించాలి. 
  • విద్యార్థులను చేర్చడానికి వచ్చే తల్లిదండ్రులకు ఫీజులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి. ఫీజులకు సంబంధించిన రశీదులను వారికి ఇవ్వాలి. 
  • తమ వద్దే పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదు. 
  • యూనిఫాం ఐదేళ్ల వరకు మార్చకూడదు. 
  • బోధన, బోధనేతర సిబ్బంది అర్హతలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఇతర ఖర్చుల రికార్డులను కమిషన్ వెబ్ సైట్లో పొందుపర్చాలి. 
  • ఫీజు రూపంలో వసూలు చేసే మొత్తంలో 50 శాతాన్ని సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించాలి. 
  • 15 శాతం నిధులను గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్సులకు కేటాయించాలి. 
  • 15 శాతం నిధులను సంస్థ నిర్వహణకు (అద్దె, విద్యుత్తు చార్జీలు, ఇతర ఖర్చులకు) వినియోగించాలి.
  • 20 శాతం నిధులను విద్యాసంస్థ అభివృద్ధికి కేటాయించాలి. అదనపు భవనాల నిర్మాణం, పాఠశాల అప్ గ్రెడేషన్, కాలేజీల్లో అదనపు కోర్సుల ఏర్పాటు తదితరాలకు ఖర్చు చేయాలి. 
  • ఈ ఫీజులు 2021-22 నుంచి మూడేళ్లకు వర్తిస్తాయి. 
  • ఏదైనా విద్యాసంస్థకు గుర్తింపు కొనసాగని పక్షంలో ఆ సంస్థ ఈ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. 

Leave a Comment