ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజులు ఖరారు

కనిష్ఠం 35 వేలు, గరిష్ఠం 70 వేలు

అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ట్యూషన్‌ ఫీజులు ఖరారయ్యాయి. కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలను నిర్ణయిస్తూ ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుల కంటే భారీగా తగ్గించడం గమనార్హం. రాష్ట్రంలో 287 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా.. అన్ని కాలేజీలకు వాటి స్థాయిలను బట్టి కమిషన్‌ ఫీజులను సిఫారసు చేసింది. ఈ మేరకు  కమిషన్‌ సెక్రెటరీ ఎన్‌.రాజశేఖరరెడ్డి సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్రకు నివేదికను సమర్పించారు. ఈ ఫీజులు 2019-20 విద్యాసంవత్సరానికి మాత్రమే అమలు కానున్నాయి. నివేదికలోని కీలక అంశాలు..

కళాశాలల నైపుణ్యం, సామర్థ్యంతో పనిలేకుండా గరిష్ఠ ఫీజును రూ.70 వేలుగా నిర్ణయించారు. 190 కాలేజీలకు రూ.35 వేలు కనిష్ఠ ఫీజు. 38 కాలేజీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే తక్కువగా గరిష్ఠ ఫీజును నిర్ణయించారు. 12 కాలేజీలకు 2012-13లో నిర్ణయించిన ఫీజుల కంటే కూడా ఇప్పుడు తగ్గించారు. దాదాపు 21 కాలేజీలకు రూ.60,000-70,000 గరిష్ఠ ఫీజుగా సిఫారసు చేశారు.

 

Leave a Comment