పెళ్లయితే విడిపోతామనే భయంతో.. కవలలు ఆత్మహత్య..!

ఇద్దరూ కలిసి పుట్టారు.. కలిసి పెరిగారు..ఒకటిగా ఉండాలనుకున్నారు. తమకు పెళ్లిళ్లు అయితే విడిపోతామని, కలిసి ఉండలేమని భయపడ్డారు. ఒకటిగానే చనిపోవాలనుకున్నారు. పెళ్లయితే విడిపోతామనే భయంతో ఇద్దరు కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, మన్సహల్లి గ్రామానికి చెందిన దీపిక, దివ్య(19) ఇద్దరు కవలలు. వీరిద్దరు చిన్నతనం నుంచే ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. ఒకే స్కూల్, ఒకే రకమైన దుస్తులు.. ఇలా అన్నింటికి అలవాటుపడ్డారు. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. 

 అయితే వారికి పెళ్లి వయసు రావడంతో ఇంట్లో వాళ్లు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వీరిని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లిళ్లు అయ్యాక వేర్వేరు ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని దీపిక, దివ్యలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 

పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లిపోతే తమ బంధం తెగిపోతుందని భావించి మరణంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

 

Leave a Comment