కశ్మీర్ భూములను ఇక ఎవరైనా కొనొచ్చు..!

జమ్మూకశ్మీర్ భూములను ఇక ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. జమ్మూకశ్మీర్ లో భూముల కొనుగోలుకు సంబంధించి 11 చట్టాల్లో మార్పులు చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక్కడి భూములను ఏ భారతీయుడైనా కొనొచ్చు. వ్యవసాయ భూములను మాత్రం సాగు చేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలి. 

ఆర్టికల్ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్క ఉండేది. కానీ సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించింది. దీంతో ఇప్పుడు భూములను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. అయితే వ్యవసాయ భూములను వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదు. అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు ఉపయోగించుకోవచ్చు. 

కాగా తాజా నోటిఫికేషన్ పై కశ్మీర్ లోని రాజకీయ పార్టీలు గట్టిగానే స్పదించాయి. కశ్మీర్ ను అమ్మకానికి పెట్టేశారని విమర్శించాయి. కేంద్రం చర్యలపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అద్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్యలను విమర్శిస్తూ జమ్మూకశ్మీర్ ను ఖైదు చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక్కడి సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా తాజా మార్పులు తీసుకొచ్చారని మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. 

 

Leave a Comment