సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. పాస్ అయితేనే వారికి ఓట్లు..గ్రామస్తుల వినూత్న ఆలోచన..!

సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారా.. అయితే రాత పరీక్ష రాసి.. పాస్ అవ్వాల్సిందే.. అప్పుడు వారికి ఓట్లు వేస్తారు.. పాస్ కాకపోతే పోటీలో నుంచి తప్పుకోవాల్సిందే.. ఈ కండీషన్ ఏదో బాగుంది కదూ.. ఈ కండీషన్స్ ఒడిశా రాష్ట్రంలోని ఓ గ్రామంలో గ్రామస్తులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పెట్టారు. మరీ ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

రాష్ట్రంలోని సుందర్ గడ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో గ్రామస్తులందరూ సమావేశమై ఓ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రాత పరీక్షలు రాయాలని కండీషన్ పెట్టారు. ఈ కండీషన్లను చూసి కొందరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. 

గ్రామస్తులు ఏం కండీషన్స్ పెట్టారంటే.. అభ్యర్థులకు ఏడు ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం రూపొందించారు. మీరు గెలిస్తే రానున్న ఐదేళ్ల కాలంలో చేసే అభివృద్ధి పనులేంటీ? ఇప్పుడు ఇంటింటికీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు.. గెలిచిన తర్వాత మమ్మల్ని పలకరించేందుకు వస్తారా? గత ఐదేళ్లలో మీరు చేసిన సమాజ సేవలు ఏంటీ? వంటి ప్రశ్నలు ఆ ప్రశ్నాపత్రంలో ఉన్నాయి. 

ఈ కండీషన్లకు ఒప్పుకుని 8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 8 మంది అభ్యర్థులు గ్రామస్తులు పెట్టిన రాత పరీక్షను రాశారు. వీరిలో ముగ్గురు మాత్రమే రాత పరీక్షలో పాస్ కాగా.. ఐదుగురు ఫెయిల్ అయ్యారు. ఈ ముగ్గురిలో గ్రామస్తులు ఎవరికీ ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గ్రామస్తులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హామీలు విని విసిగిపోయారని, అందుకోసమే వారితో ఇలా రాత పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నామని గ్రామస్తులు తెలిపారు. మరీ ఇలాంటి కండీషన్స్ మన గ్రామాల్లోనూ పెడితే బాగుంటుంది కదూ..  

Leave a Comment