విజయవాడలో విషాదం.. కొన్న ఒక్కరోజులలోనే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒకరు మృతి..!

విజయవాడలో విషాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఒకరు మృతి చెందగా.. అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కొన్న మరుసటి రోజే పేలడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వివరాల మేరకు విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ శుక్రవారం కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. 

ఇంట్లోని బెడ్ రూమ్ లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. పెట్రోల్ భారం ఉండదని.. తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ పెట్టుకుని ఎంచక్కా తిరగవచ్చని భావించిన శివకుమార్ కుటుంబం జరగబోయే విషాదాన్ని ఊహించలేకపోయింది. శనివారం తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. 

ఈ ఘటనలో శివకుమార్ తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులకు స్థానికులు తలుపులు పగలగొట్టి.. అతికష్టం మీద శివకుమార్ ని, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలిస్తుండగా.. శివకుమార్ మార్గంమధ్యలోనే మృతి చెందాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్ భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

పెట్రోల్ భారం తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోయాయి. దీంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

   

Leave a Comment