భారత్ లో ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి : ట్రంప్‌

అహ్మదాబాద్‌: భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, దాన్ని చాటి చెప్పేందుకే నేను 8000 మైళ్లు ప్రయాణించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌.. ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 

‘భారత్‌ అంటే మాకు చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. దాన్ని చాటిచెప్పేందుకు మెలానియా, నేను 8000 మైళ్లు ప్రయాణించాం. మోతెరా లాంటి అద్భుతమైన స్టేడియంలో ప్రసంగించడం గర్వంగా ఉంది. భారత్‌లో నాకు ఘన స్వాగతం లభించింది. దీన్ని నేను, మెలానియా ఎప్పటికీ మర్చిపోం’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

మోదీ అసాధారణ నేత

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ అసాధారణ నేత అని, భారత అభివృద్ధి కోసం ఆయన రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మోదీ గుజరాత్‌కు మాత్రమే ఆదర్శం కాదని, శ్రమ.. పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ఆయన నిరూపించారని ట్రంప్‌ చెప్పారు.  ‘‘మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఒక ఛాయ్‌ వాలాగా జీవితం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలో అందరూ ఆయన్ను అభిమానిస్తారు. మోదీ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. నా నిజమైన స్నేహితుడు మోదీ. అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ మైదానంలో మోదీకి స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంలో నాకు స్వాగతం పలికారు’’ అని ట్రంప్‌ చెప్పారు.

భారత్‌ ఎదుగుదల ప్రపంచానికి మార్గదర్శకం

‘భారత్‌ అద్భుత అవకాశాలకు నెలవు. 70ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. ప్రపంచానికి భారత్‌ ఎదుగుదల ఓ మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. భారత్‌ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోళీ జరుపుకొంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి జీవించే దేశం ఇది. వందకు పైగా భాషలతో కలిసిమెలిసి ఉండే భారత్‌ ప్రపంచానికి ఎంతో ఆదర్శం. అమెరికాకు గుజరాతీలు అందించిన సేవలు ప్రశంసనీయమైనవి. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం నాలో గొప్ప స్ఫూర్తి నింపింది. మహాత్ముడిని స్మరిస్తూ రేపు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తా’ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. 

పురుషులూ జాగ్రత్త..!

‘దక్షిణాసియాలో భారత్‌ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగింది. ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు వృద్ధి పథంలో ఉన్నాయి. మోదీ వేగవంతమైన సంస్కరణలతో వ్యాపార వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలు గొప్ప ప్రగతి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకొస్తున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండండి’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌ నోట సచిన్‌, కోహ్లీ మాట

ఈ సందర్భంగా బాలీవుడ్‌ సినిమాలు, క్రీడల గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ లాంటి గొప్ప క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారత్‌ది అని కొనియాడారు. ఇక భారత్‌ ఏటా 2000లకు పైగా సినిమాలను విడుదల చేస్తోందని, వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, షోలే లాంటి క్లాసికల్‌ చిత్రాలను యావత్‌ ప్రపంచం ఎంతో ఎంజాయ్‌ చేస్తోందన్నారు. 

రేపు 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం

‘ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతుంది. భారత్‌కు మరిన్ని అధునాతన సైనిక పరికరాలు, ఆయుధాలు అందించేందుకు అమెరికా ఎదురుచూస్తోంది. దీనికోసం మంగళవారం భారత్‌, అమెరికా మధ్య 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదరనుంది. రక్షణరంగంలో భారత్‌కు అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉండనుంది. ద్వైపాక్షిక బంధానికి మోదీ, నేనూ కృషి చేస్తాం’ అని ట్రంప్‌ తెలిపారు. 

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..

‘ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత్‌-అమెరికా ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి మా ప్రజలను రక్షించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇటీవలే మేం ఐసిస్‌ అధినేతను హతమార్చాం. అది చాలా గొప్పవిషయం. ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తున్నాం. దీని వల్ల భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశిస్తున్నాం’ అని ట్రంప్‌ చెప్పారు. 

చంద్రయాన్ ‌2పై ప్రశంసలు      

‘అంతరిక్ష అన్వేషణలో భారత్‌, అమెరికా దగ్గరగా పనిచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో భారత అంతరిక్ష ప్రయోగాలు అభినందనీయం. చంద్రయాన్‌ 2 గొప్ప ప్రయోగం. అంతరిక్ష విజయాల కోసం అమెరికా భారత్‌కు ఎల్లప్పుడూ సహకారం అందిస్తుంది’ అని ట్రంప్‌ పేర్కొ్న్నారు. 

ప్రపంచ శాంతి, ప్రజల ఆకాంక్షలకు రెండు దేశాలు శక్తిమంతమైన రక్షకులుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు. ‘ఈ రోజు మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. భారతదేశ గత వైభవానికి మీరంతా గర్వపడాలి. భవిష్యత్తు కోసం ఏకమవ్వాలి. స్వేచ్ఛ, విలువల కోసం రెండు దేశాలు కలిసి రావాలి. గాడ్‌ బ్లెస్‌ అమెరికా, గాడ్‌ బ్లెస్‌ ఇండియా. వి లవ్‌ ఇండియా వెరీ మచ్‌’ అంటూ ట్రంప్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

ట్రంప్ కు మోదీ ఘన స్వాగతం

అంతకు ముందు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కు మోదీ ఘన స్వాగతం పలికారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది.

22 కి.మీ. రోడ్‌ షో..

ఎయిర్‌పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.

 

Leave a Comment