త్వరలో ‘డాల్ఫిన్ క్రూయిజ్’

నూతన మోడల్ బస్సులను తీసుకురానున్న ఆర్టీసీ

ఏపీఎస్ ఆర్టీసీ త్వరంలో డాల్ఫిన్ క్రూయిజ్ బస్సులను తీసుకురానుంది. మార్చి లేదా ఏప్రిల్ లో తీసుకొచ్చేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ ఆర్టీసీలో లేని విధంగా ఈ బస్సు 14.5 మీటర్ల పొడవు, 2.59 మీటర్ల వెడల్పు ఉండనుంది. లగ్జరీ(ఏసీ) సెగ్మెంట్ లో భారత్ స్టేజ్(బీఎస్)-4 ప్రమాణాలతో వీటిని తయారు చేశారు. ఒకో్క బస్సును రూ.1.26 కోట్లతో మొత్తం 22 బస్సులను వోల్వో సంస్థ నుంచి ఇప్పటికే కొనుగోలు చేశారు.

ఈ 22 బస్సుల్లో 16 బస్సులు 14.5 మీటర్లు కాగా, మిగిలిన బస్సులు 13.8 మీటర్లు ఉండనున్నాయి. ఈ మల్టీయాక్సిల్ బస్సులో 60 మంది ప్రయాణించేందుకు వీలుగా సీట్లను ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా రాజధాని విశాఖపట్నంను ప్రకటించిన నేపథ్యంలో అక్కడి నుంచే వీటిని నడపాలని అధికారులు యోచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు వంటి దూర ప్రాంతాలకు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసిన తరువాత ఆర్టీసీలో తీసుకొచ్చిన కొత్త రకం బస్సులను అమరావతి పేరుతో ప్రవేశపెట్టారు. ఇప్పుడు విశాఖపట్నం ముద్ర పడేలా అక్కడున్న ‘డాల్ఫిన్’ కొండ పేరుతో  ‘డాల్ఫిన్ క్రూయిజ్’ పేరును పెట్టారు. సముద్రంలో నుంచి డాల్ఫిన్ పైకి ఎగిరిపడుతున్నట్లు, డాల్ఫిన్ ముక్కు దగ్గర ఆర్టీసీ లోగో ఉండేలా తీర్చిదిద్దారు. సముద్రతీరంలోని లైట్ హౌస్ కూడా ఈ బస్సు మీద దర్శనమివ్వనుంది. దూర ప్రాంత ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ మల్టీయాక్సిల్ బస్సులు తీసుకురానున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

Leave a Comment