ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో నిర్లక్ష్యం ..‘చచ్చిపోతున్న బై డాడీ..అందరికీ బై‘

హైదరబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలిగొంది. కరోనా లక్షణాలతో ఓ యువకుడికి వెంటిలేటర్ పెట్టకపోవడంతో అతడు ప్రాణాలు వదిలాడు. అయితే చనిపోయేముందు ఆ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘వెంటిలేటర్ తీసేశారు..ఊపిరి ఆటడం లేదన్నా పట్టించుకోవడం లేదు..గుండె ఆగిపోయింది..ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుంది..బై డాడీ..అందరికీ బై’ అంటూ చివరి క్షణంలో ఆ యువకుడు పెట్టిన వీడియో అందరినీ కలిచి వేస్తోంది. 

నగరంలోని జవహర్ నగర్ కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో చెస్ట్ ఆస్పత్రిలో చేరాడు. తనకు ఊపిరి ఆడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాలని వేడుకున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశాడు. తనకు పెట్టిన వెంటిలేటర్ ను తొలగించారని ఆరోపించాడు. అందరికీ బై అంటూ దయనీయ స్థితిలో చనిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో  డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. 

Leave a Comment