ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ : సీఎం జగన్

జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నామని, కొంత మంది టీడీపీ నాయకులు దీనిపై కోర్టుకు వెళ్లారని, దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో ఇళ్ల పట్టాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ డి-పట్టాల కింద, అసైన్డ్ కింద భూములు పట్టాలు ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చని, డి-పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇస్తే వారికి ఆస్తి ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. 

సుప్రీం కోర్టులో పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ఎప్పటికైనా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. ఏపీలో దాదాపు 20 శాతం మంది జనాభాకు ఇళ్లపట్టాలు ఇస్తున్నామన్నారు. దాదాపు 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నాటికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, అప్పటికి కోర్టు కేసులు పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకంతో ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు దీనిపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. 

62 వేల ఎకరాలు సేకరించాం..

ఇళ్లపట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించామని, పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశామన్నారు. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. 

ఎవరిపేరైనా రాకపోతే దరఖాస్తు చేయించాలి..

లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టా డాక్యుమెంట్లలో లబ్ధిదారుని ఫొటోలు పెట్టడం, ఫ్లాట్‌ నంబర్‌, హద్దులు పేర్కొనడం చేయాలని అధికారులకు సూచించారు. ఈ  టైం గ్యాప్‌ను సద్వినియోగంచేసుకోవాలన్నారు. దీనివల్ల సునాయాసంగా రిజిస్ట్రేషన్‌ చేయించడం వీలవుతుందన్నారు. అలాగే బిల్లులు కూడా పెండింగులో లేకుండా చూడాలన్నారు. ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలని సూచించారు. ఇంకా ఎవరైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోతే.. దరఖాస్తు చేస్తే, ఎంక్వైరీ చేసిన తర్వాత 90 రోజుల్లోనే పట్టా వారికి ఇవ్వాలని ఆదేశించారు. జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే వారిచేత దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. 

Leave a Comment