దిశ యాప్ పనితీరు ఇలా..!

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం దిశ యాప్ ను తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో మహిళులు, యువతులు తమ ఫోన్ ఊపితే కంట్రోల్ రూమ్ కు కాల్ కనెక్ట్ కానుంది. ఇందు కోసం ప్రత్యేకంగా దిశ యాప్ రూపొందించారు. అత్యవసర సమయాల్లో ఫొన్ ఆపరేట్ చేసేందుకు వీలుకాని సమయాల్లో ఫోన్ ను ఊపితే దిశ కంట్రోల్ రూమ్ కు, కుటుంబ సభ్యులకు అలెర్ట్ మెసేజ్ వెళ్లనుంది. ఫోన్ లొకేషన్ తో పాటు 10 సెకన్ల ఆడియో, వీడియో కూడా కంట్రోల్ రూమ్ కు చేరనుంది. వాటి ఆధారంగా పోలీస్ సిబ్బంది స్పందించి సాయం అందించనున్నారు. ఈ యాప్ ఇప్పుడు వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. అసలు దీని పనితీరు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

దిశ యాప్ పని చేసే విధానం…

  • ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ లోకి వెళ్లి దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం. తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా యాప్ ను ఉపయోగించవచ్చు. 
  • ఆపదలో ఉన్న వారు ఈ యాప్ ను ఓపెన్ చేసి అత్యవసరు సహాయం (SOS) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్ కు చేరతాయి. 
  • SOS బటన్ నొక్కే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్ ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్ కు సమాచారం చేరుతుంది. 
  • SOS బటన్ ను నొక్కితే వాయిస్ తో పాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్ కు పంపించే వీలు ఉంది. 
  • SOS బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్ కు సమాచారం వెళ్లి. . అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్ గా కాల్ వెళ్తుంది. 
  • ప్రమాదంలో ఉన్న వారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. 
  • ఆపదలో ఉన్నప్పుడు సమాచారా్ని పోలీసులతో పాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్ లో నమోదు చేసుకోవచ్చు. 
  • దిశ యాప్ లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయవచ్చు. 
  • ఆ యాప్ లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లకు కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతోంది. 
  • దిశ యాప్ లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

Leave a Comment