చదువే వద్దన్నారు.. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది..!

అమ్మాయిలకు చదువెందుకు అనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఆర్థిక భారంతో కొందరు, అమ్మాయికి ఎలాగో పెళ్లి చేయాలి కదా అని మరికొందరు ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తుంటారు. అలా ఆ అమ్మాయిని కూడా చదువు ఆపేయాలని తల్లిదండ్రులు చెప్పారు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. తల్లిదండ్రులను బతిమాలి, ఒప్పించి కష్టపడి చదివింది. డీఈఈ సెట్ పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది కుమురం భీం జిల్లాకు చెందిన గడీల అనోధ..

జిల్లాలోని కాగజ్ నగర్ మండలం బోడపల్లి గ్రామానికి చెందిన తిరుపతి, రాజేశ్వరీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. తిరుపతి తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అప్పులు చేసి పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అప్పులే ఇంకా తీరలేదు. పైగా గ్రామంలో 8వ తరగతి వరకే ఉంది. పది వరకు కొనసాగించాలంటూ 3 కి.మీ.. దూరంలోని ఇట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి. దీంతో రెండో అమ్మాయి తమకు చేదోడుగా ఉంటుందని భావించారు. అనోధకు చదువు వద్దని చెప్పారు.

చదువు మానేసేందుక అనోధ అంగీకరించలేదు. శంకర్రావు అనే మాస్టారు సాయంతో తల్లిదండ్రులను ఒప్పించింది. అలా 2019లో 9.3 గ్రేడింగ్ తో పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత ఇంటర్ చేరాలి. మళ్లీ చదువు ఎందుకని చెప్పారు. మళ్లీ శంకర్రావు మాస్టారు నచ్చజెప్పారు. దీంతో దహెగాం కస్తూర్బా కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరింది. 976 మార్కులు సాధించి కాలేజ్ ఫస్ట్ వచ్చింది. 

టీచింగ్ పై ఆసక్తి ఉండటంతో ఇంటర్ తర్వాత డీఈఈ సెట్ రాయాలని ఉపాధ్యాయులు సూచించారు. అయితే ఆమెకు కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇంట్లోనే చదువుకుంది. డీఈఈ సెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చదువే వద్దన్న తల్లిదండ్రులు శభాష్ అనేలా చేసింది. భవిష్యత్తులో టీచర్ అయి, తర్వాత సివిల్స్ రాస్తానని గడీల అనోధ చెప్పింది.   

Leave a Comment