తిక్క తీర్పూ : అత్యాచార నేరానికి ఐదు చెప్పు దెబ్బలు..!

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పంచాయతీ పెద్దలు తిక్క తీర్పు ఇచ్చారు. నిందితుడికి బాధితురాలు ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కుగ్రామంలో జరిగింది. 

వివరాల మేరకు గ్రామంలోని ఓ యువకుడు తమ మైనర్ కూతురిపై అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు గ్రామ పంచాయతీని ఆశ్రయించారు.  అయితే ఈ ఫిర్యాదుపై పంచాయతీ పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. నిందితుడిని బాధితురాలు చెప్పుతో ఐదు సార్లు కొట్టాలని తీర్పు చెప్పారు. అంతేకాదు 50 వేల రూపాయల పరిహారం తీసుకొని ఈ ఘటన మరిచిపోవాలని సూచించారు. 

పంచాయతీ పెద్దలు చెప్పిన తీర్పును బాలిక తల్లిదండ్రులు ఓప్పుకోలేదు. దీంతో పంచాయతీ పెద్దలు తమ తీర్పునే వ్యతిరేకిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సంతృప్తి చెందని తల్లిదండ్రులు కోతిభార్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.  

 

Leave a Comment