పురుషుల సంతానోత్పత్తిపై కోవిడ్ ప్రభావం.. పరిశోధనలో వెల్లడి..!

కోవిడ్ సోకిన వారిపై ఐఐటీ బాంబే పరిశోధకులు షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు శ్వాసవ్యవస్థపైనే కోవిడ్ దెబ్బ తీస్తుందని అనుకున్నాం.. కానీ పురుషుల సంతానోత్పత్తిపై కూడా కోవిడ్ ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ సోకిన పురుషల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వెల్లడించారు. 

ఐఐటీ బాంబే, ముంబాయిలోని జస్ లోక్ ఆస్పత్రి పరిశోధన కేంద్రం నిపుణులు కోవిడ్ బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కరోనా బారిన పడి కోలుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని తేలింది. స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలతో ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వెల్లడించారు. 

ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కరోనా బారిన పడి కోలుకున్న వారి వీర్య కణాల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోల్చితే.. కరోనా బారినపడిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. 

కరోనా బారిన పడిన వారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది.వాటి మొబిలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉందని పరిశోధకులు వెల్లడించారు.  ఆకారంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తికి దోహదపడే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయి పెరగ్గా, 21 ప్రొటీన్ల స్థాయిలు తగ్గాయి. సెమెనోజెలిన్-1, ప్రొసాపోసిన్ ప్రోటీన్ల స్థాయిలు ఉండాల్సిన దానిలో సగం కంటే తక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. 

 

 

Leave a Comment