అమెరికాలో కరోనా  విజృంభణ.. ఒక్క రోజే పది లక్షల కరోనా కేసులు..!

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుంది. గతేడాది కూడా అమెరికాను చిగురుటాకులా కరోనా మహమ్మరి వణికించింది. ఇప్పుడు అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుండటం వల్లే అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో వ్యాపిస్తున్న అన్ని కరోనా వేరియంట్ కేసుల్లో 58.6%  కేసులకు  ఒమిక్రానే కారణమని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. దీని తర్వాత డెల్టా వేరియంట్ బాధితులు 41.1% మంది ఉన్నారని తెలిపింది.

అమెరికాలో ఒక్కరోజే 10లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి అమెరికాలో ఇవే అత్యధిక కేసులు. గత కరోనా వేవ్‌లతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం 5లక్షల 91 వేల కేసులు నమోదవగా.. తాజాగా 10లక్షలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది.

ఇక వైరస్​ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షమందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 8లక్షల 26వేల మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ విజృంభణతో 12 నుంచి 15 ఏళ్ల వయసు వారితో పాటు బూస్టర్​ డోస్​ అందించేందుకు ఫైజర్​ టీకాకు ఎఫ్‌డీఏ అనుమతులిచ్చింది. ఇక భారత్‌లోనూ కోవిడ్ ఉధృతికి మరోసారి మొదలైంది. ఓ వైపు కరోనా.. మరో వైపు కోవిడ్ వేరియట్ ఒమిక్రాన్‌ కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. నిన్న దేశంలో 37,379 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

అదే సమయంలో 11,007 మంది కోలుకున్నారు. ఈ సమయంలో 124 మంది కోవిడ్‌తో మరణించారు. కరోనా డెల్టా వేరియంట్‌తో పాటు.. ఓమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరింది. మహారాష్ట్ర , ఢిల్లీలో అత్యధికంగా 568 , 382 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఓమిక్రాన్ 1,892 మంది రోగులలో 766 మంది కోలుకున్నారు.

కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించారు. ఇతరుల నుంచి భౌతిక దూరం, ఇంటి నుంచి బయటకు వెళితే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైన సమయంలో శానిటైజర్ వినియోగించడం చేస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. మాస్కులను ముక్కు, నోరు, దవడ భాగాలను సరిగ్గా కప్పి ఉంచేలా ధరించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలు సరిగా పాటించకపొతె అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో ఈ సారి భారీగా కరోనా ఎఫెక్ట్ ఉంటుంది అని నిపుణుల అంచనా వేశారు.

 

Leave a Comment