పిల్లలకు కరోనా ముప్పు తక్కువే.. తేల్చి చెప్పిన WHO..!

కరోనా థర్డ్ వేవ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఇండియాలో వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. థర్డ్ వేవ్ ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు కూడా హెచ్చరించారు. తాజాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ఫష్టత ఇచ్చింది. పిల్లలపై కరోనా ముప్పు లేదని స్పష్టం చేసింది. చిన్న పిల్లల్లో కరోనా వ్యాప్తి, తీవ్రత చాలా తక్కువని చెప్పింది. ఒకవేళ సోకినా పెద్ద ప్రభావం ఉండదని వెల్లడించింది. 

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 5 ఏళ్ల లోపు చిన్నారులు 1.8 శాతం మాత్రమే ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే వయస్సు పెరుగుతున్న కొద్ది దీని వృద్ధి కనిపిస్తోందని చెప్పింది. కరోనా బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు 6.2 శాతం, 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు 14.3 శాతం మంది ఉన్నారని పేర్కొంది. చిన్నారుల్లో మరణాలు కూడా తక్కువగానే నమోదయ్యాయని తెలిపింది. కరోనా మరణాల్లో 15 ఏళ్ల పైబడిన వారిలో 99.8 శాతం మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

అయితే ఏడాదిలోపు పిల్లల్లో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, ఒకవేళ సోకితే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ముఖ్యంగా నెలలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వారిలో మరణాల ముప్పు అధికమని తెలిపింది. చిన్నారుల్లో సాధారణ జలుబు, దగ్గు తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించడం లేదని, దీంతో కరోనా పరీక్షలు చేయించడం లేదని, దీని వల్ల కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక 5 ఏళ్ల లోపు వయస్సు వారికి మాస్కు అవసరం లేదని, అంతకు పైబడిన వయసు వారు మాస్కు తప్పనిసరిగా వాడాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.  

 

 

Leave a Comment