ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి : మోహన్ భగవత్

తొలిదశ కరోనా మహమ్మారి తర్వాత పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సెకండ్ వేవ్ విపత్తు సునామీలా ముంచెత్తిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత జాతీయ ఆరోగ్య సంక్షోభానికి అదే ప్రధాన కారణమన్నారు. తొలి వేవ్ తర్వాత మనమంతా నిర్లక్ష్యంగా ఉన్నామన్నారు. ఈ పరిస్థితికి పౌరులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇలా అందరూ బాధ్యులే అన్నారు. 

మరో దశ వస్తుందని వైద్యులు హెచ్చరించారని, అయినా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ మూడో వేవ్ గురించి నిపుణులు అప్రమత్తం చేస్తున్నారన్నారు. దానిపై మనలో భయం ఉందా? సరైన దిశలో పోరాటానికి సిద్ధమవుతున్నామా? అని ప్రశ్నించారు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న పాజిటివిటీ అన్ లిమిటెడ్ ప్రసంగాల్లో భాగంగా శనివారం ఆయన ఈ మేరకు వ్యాఖ్యాలు చేశారు.

ప్రస్తుత అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా, తదుపరి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు, ప్రభుత్వం భవిష్యత్ పై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మహమ్మారిపై భారతీయులు పూర్తి వజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జీవితం, మరణం చక్రం కొనసాగుతుందన్నారు. ఈ విషయాలు మమ్మల్ని భయపెట్టలేవన్నారు. ఈ పరిస్థితులే భవిష్యత్ కోసం మనకు శిక్షణ ఇస్తాయని, విజయం అంతిమం కాదని, వైఫల్యం ప్రాణాంతకమ కాదని, ధైర్యంగా ముందుకు సాగడమే ముఖ్యమని భగవత్ చెప్పారు.

Leave a Comment