టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్..యువకుడు షాక్..

అత్యంత పారదర్శకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని కరోనా పరీక్షల్లో డొల్లతనం ఎలా ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. ఒక యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించకుండానే పాజిటివ్ వచ్చినట్లు మెసేజ్ పంపారు. పరీక్షలు చేయకుండానే పాజిటివ్ ఎలా వచ్చిందంటూ యువకుడు ఆందోళన చెందుతున్నాడు. 

వివరాల మేరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.కొత్తూరుకు చెందిన 28 ఏళ్ల యువకుడు జ్వరంగా ఉండటంతో ఈనెల 25న కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కు కరోనా పరీక్షల కోసం వెళ్లాడు. అక్కడు సిబ్బంది ఆ యువకుడి వివరాలు నమోదు చేసుకున్నారు. పరీక్షలు ఎప్పుడు చేస్తామో ఫోన్ చేసి చెబుతామని అక్కడి నుంచి పంపించారు. ఇక ఆ యువకుడు అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. 

తనకు పరీక్షల కోసం ఎప్పుడు పిలుస్తారో అని వేచి ఉన్నాడు. అంతలోనే తనకు పాజిటివ్ వచ్చినట్లు శనివారం పీహెచ్సీ సిబ్బంది ఇంటికి వచ్చి చెప్పింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. తనకు పరీక్షలు చేయకుండా పాజిటివ్ ఎలా వచ్చిందంటూ వేట్లపాలెం పీహెచ్సీ వైద్యాధికారి ధనలక్ష్మికి ఫిర్యదాు చేశాడు. ఆమె ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు.  

Leave a Comment