చిన్న పిల్లల్లోనూ కరోనా.. కొత్త లక్షణాలు ఇవే..! 

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  ప్రపంచమంతా కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ఊపందుకుంది. ఈ దశలో పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అమెరికాలో ఇప్పటికీ 23 నుంచి 30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడ్డారు. మన దేశంలోనూ చిన్నపిల్లలు వైరస్ బారినపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 

డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ లో కొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంత మంది చిన్నపిల్లలకు కడుపు నొప్పి రావడం.. దాంతో పాటు వాంతులు కావడం జరుగుతోంది. అయితే జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. కడుపు నొప్ప రావడాన్ని చాలా మంది పేరెంట్స్ అజీర్ణ సమస్యగా అనుకుంటున్నారు. కొందరికి ప్రాథమిక చికత్స అందిస్తే తగ్గిపోతుంది. 

కానీ మరి కొంతమంది పిల్లల్లో తగ్గడం లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరియంట్ లో కడుపు నొప్పి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలి:

చిన్న పిల్లల్లో తల నొప్పి, 100 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే వారు మాస్క్ కూడా సరిగ్గా పెట్టుకోరు. ఈ వయస్సు వారికి టీకా కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Leave a Comment