కరోనాను వదలని బాబాలు..!

ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారు చేసేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయినా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇస్మాయిల్ అనే బాబా కరోనాను నయం చేస్తానంటూ అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నాడు. తన అతీతమైన శక్తులతో కరోనా రోగులను నయం చేస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. తన శిశ్యుల ద్వారా కరోనా రోగులకు చికిత్స చేస్తున్నట్లు ప్రచారం చేయించుకుంటున్నాడు. అతని మాటలు నమ్మి వచ్చిన వారికి చేతిలో నిమ్మకాయలు పెట్టి, విభూతి పూసి కరోనా నయమైందంటూ పంపిస్తున్నాడు. ఇక నుంచి మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఆస్పత్రికి వెళ్లాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నాడు. ఇందు కోసం రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నాడు.

ఇక అతని మాటలు నమ్మి మోసపోయిన బాధితులు హైదరాబాద్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలోని బాబా స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. అక్కడ వారికి విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు  70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్లు తెలిసింది. కరోనా సోకినట్లయితే ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలని, ఇటువంటి బాబాల చేతిలో మోసపోవద్దని పోలీసులు సూచించారు. 

 

Leave a Comment